మ‌ళ్లీ క‌రోనా బారిన ప‌డిన అమితాబ్ బచ్చన్‌

Amitabh Bachchan tests Covid-19 positive for the second time. అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2022 8:26 AM IST
మ‌ళ్లీ క‌రోనా బారిన ప‌డిన అమితాబ్ బచ్చన్‌

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. "ఇప్పుడే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా నాతో పాటు ఉన్న వారంతా, న‌న్ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోండి. జాగ్ర‌త్త‌గా ఉండండి" అని మంగ‌ళ‌వారం రాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు.

బిగ్‌బీ ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్‌ప‌తి 14వ సీజ‌న్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. అమితాబ్‌కు క‌రోనా సోకడంతో ఈ ప్రొగ్రామ్ షూటింగ్‌ను వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అమితాబ్‌ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కామెంట్లు పెడుతున్నారు.

అమితాబ్‌ కీల‌క పాత్ర‌లో న‌టించిన 'బ్ర‌హ్మ‌స్త్ర' చిత్రం సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ న‌టించారు.

అమితాబ్‌ తొలిసారి 2020 జులై 11న కరోనా బారిన ప‌డ్డారు. ఆ సమయంలో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చాలా రోజులు పాటు చికిత్స పొందారు. ఆ స‌మ‌యంలో అమితాబ్ కుమారుడు అభిషేక్‌, కోడలు ఐశ్వర్యారాయ్‌, మనుమరాలు కూడా వైరస్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Next Story