త‌గ్గేదేలే.. అల్లు అర్జున్ కు 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

Allu Arjun Receives 'Indian of the Year' Award.అల్లు అర్జున్ ఖాతాలో మ‌రో అవార్డు చేరింది. ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2022

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2022 5:47 PM IST
త‌గ్గేదేలే.. అల్లు అర్జున్ కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

'పుష్ప' చిత్రంతో జాతీయ స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. 'త‌గ్గేదేలే' అనే డైలాగ్‌లో అభిమానుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేశాడు. పుష్ప‌రాజ్ న‌ట‌న‌కు అవార్డులు క్యూ క‌ట్టాయి. వ‌రుస అవార్డులు అందుకుంటున్న అల్లు అర్జున్ ఖాతాలో మ‌రో అవార్డు చేరింది. దేశంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే "ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2022" అవార్డును గెలుచుకున్నాడు.

ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర‌ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా బ‌న్నీ ఈ అవార్డును అందుకున్నారు. "ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్" ఘ‌న‌త సాధించిన తొలి ద‌క్షిణాది న‌టుడు అల్లు అర్జునే కావ‌డం విశేషం. అవార్డు అందుకున్న అనంత‌రం బ‌న్నీ మాట్లాడుతూ.. "మ‌న‌మంతా భారత చ‌ల‌న‌చిత్ర రంగానికి బిడ్డ‌లం. ఇది భార‌త‌దేశ విజ‌యం. క‌ష్ట స‌మ‌యాల్లో వినోదంతో దేశానికి సేవ చేయ‌గ‌లిగినందుకు గ‌ర్తిస్తున్నాను. ఈ అవార్డును కొవిడ్ వారియ‌ర్స్‌కు అంకిత‌మిస్తున్నాం "అని చెప్పాడు. ఆ త‌రువాత "భార‌త‌దేశం, భార‌త‌దేశ సినిమా త‌గ్గేదేలే "అంటూ పుష్ప డైలాగ్ ను కాస్త మార్చి చెప్పారు. "నేను సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాను, దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నా ఉత్తరాది నుంచి అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకమని అల్లు అర్జున్ అన్నాడు.

ఈ అవార్డు లభించడం పట్ల అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు. 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల సీఎన్ఎన్ న్యూస్-18 మీడియా సంస్థకు కృతజ్ఞతలు చెప్పాడు. తనకు అవార్డును ప్రదానం చేసిన స్మృతి ఇరానీ గారికి ధన్యవాదాలు తెలియ‌జేశారు.

Next Story