అభిమానుల కోరిక మేరకు.. 'పుష్ప-2' డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌

'పుష్పా- ది రైజ్‌' మూవీలో తగ్గేదే లే పంచ్ డైలాగ్ అభిమానులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

By అంజి  Published on  21 July 2023 8:40 AM IST
Allu Arjun, Pushpa 2 dialogue, baby movie, Tollywood

అభిమానుల కోరిక మేరకు.. 'పుష్ప-2' డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌

'పుష్పా- ది రైజ్‌' మూవీలో తగ్గేదే లే పంచ్ డైలాగ్ అభిమానులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ సినిమాలో త‌న స్టైల్‌, స్వాగ్‌, మేన‌రిజ‌మ్‌ల‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను అల్లు అర్జున్‌ మెప్పించారు. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్‌ 'పుష్ప-2' తెరకెక్కుతోంది. దీంతో హీరో అల్లు అర్జున్ సెకండ్‌ పార్ట్‌లో ఏ పంచ్ డైలాగ్ చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'పుష్ప-2' సినిమాలోని ఓ డైలాగ్‌ని అల్లు అర్జున్‌ లీక్‌ చేశారు. 'బేబీ' సినిమా ఈవెంట్‌లో పుష్ప డైలాగ్‌ చెప్పి అందరినీ అలరించాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'బేబీ' సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.

ఈ సినిమాకు సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు. నిన్న హైదరాబాద్‌లో మేకర్స్‌ అప్రిసియేషన్ మీట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కి హీరో అల్లు అర్జున్ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. 'బేబీ' మూవీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. చిత్రయూనిట్‌కి విషేస్‌ తెలిపారు. ప్రోగ్రామ్‌ చివరిలో అభిమానులు పుష్ప-2 డైలాగ్ కావాలని కోరగా ఆయన ఓ పంచ్ డైలాగ్ వినిపించారు. 'ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది.. పుష్పా గాడి రూల్' అని అల్లు అర్జున్ అనడంతో అభిమానులు గట్టిగా కేకలు వేశారు. 'పుష్ఫ-2' డైలాగ్ చెబుతానని తాను అస్సలు అనుకోలేదని అల్లు అర్జున్ చెప్పారు. ఈ డైలాగ్‌తో ప్రస్తుతం అల్లు అర్జున్‌ అభిమానులు ఉరకలేస్తున్నారు. బన్నీ చెప్పిన డైలాగ్‌ కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story