పుష్ప-2 ప్రీమియర్ల సందర్భంగా సంధ్య సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి ఓ వీడియోను అల్లు అర్జున్ విడుదల చేసారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఆర్థిక సహాయం మాత్రమే అనుకోకండని, ఈ డబ్బు వల్ల వారికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని కూడా చెప్పారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకమైనదన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత ఇరవై ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్‌కు వెళ్లి చూసి వస్తుంటానని, ఇప్పుడు ఇలా జరగడం తమను బాధించిందన్నారు. తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటాన్నారు. తనవంతుగా రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు. ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామన్నారు.