అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు
దిగ్గజ నటుడు ఏఎన్‌ఆర్ శత జయంతి వేడుకలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక రోజున భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
By అంజి
అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు
దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అక్కినేని కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తిరుగులేని ప్రతిభావంతుల్లో ఏఎన్ఆర్ గా పేరుగాంచిన అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. సెప్టెంబర్ 20న ANR 100వ జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంవత్సరం పొడవునా, అతని జీవితం, వారసత్వాన్ని జరుపుకునే అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ప్రత్యేక రోజున భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణను చూడటమే మహాభాగ్యమని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన అక్కినేని అద్భుతమైన స్థాయికి చేరుకున్నారని, ఇది అంత చిన్న విషయం కాదని అన్నారు. అక్కినేని కారణజన్ముడని, అతను కళకారులకు దొరికిన గొప్ప వరం అని బ్రహ్మానందం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఒక గ్రంథం, ఆయన జీవితం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని నటుడు మోహన్ బాబు అన్నారు. ఏఎన్‌ఆర్‌ను చిన్నప్పటి నుంచి మూవీస్‌లో చూసి ఆరాధించానని, ఆయన అందరికీ ప్రేరణ అని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అన్నారు. అక్కినేనితో చాలా సినిమాలు చేయడం తన అదృష్టమని, ఆయన నడిచే విశ్వవిద్యాలయమని, అన్ని విషయాలపై ఆయనకు అవగాహన ఉందని నటి జయసుధ అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ''ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగార్జునకి, నాగేశ్వరరావు కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు'' ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో తెలిపారు.