డీవీవీ' కోర్టు ధిక్కరణకు పాల్పడింది: లాయర్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా టికెట్ ధరల పెంపు కేసులో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ కోర్టును అవమానించడమే అని..
By - అంజి |
'డీవీవీ' కోర్టు ధిక్కరణకు పాల్పడింది: లాయర్
పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా టికెట్ ధరల పెంపు కేసులో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ కోర్టును అవమానించడమే అని పిటిషనర్, అడ్వకేట్ మల్లేశ్ యాదవ్ అన్నారు. ధర్మాసనం అందరికీ మినహాయింపు ఇస్తే తానొక్కడికే ఇచ్చిందంటూ తీర్పును తప్పుదోవ పట్టించారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఓ మీడియా సంస్థకు తెలిపారు. అటు ట్వీట్ ద్వారా అందరూ తనను ట్రోల్ చేసేలా ప్రోత్సహించారని, దీనిపై పరువు నష్టం దావా వేయనున్నట్టు పేర్కొన్నారు.
అంతకుముందు అక్టోబర్ 9 వరకు టికెట్ ధరలు పెంచొద్దన్న హైకోర్టు తీర్పు పిటిషనర్‌కే వర్తిస్తుందంటూ ఓజీ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ''తీర్పు ఆ పిటిషనర్ బర్ల మహేశ్ యాదవ్‌కే వర్తిస్తుంది. ఆయనకు నైజాంలో టికెట్‌పై రూ.100 డిస్కౌంట్ ఇస్తున్నాం. మల్లేశ్ గారూ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అని ట్వీట్ చేసింది. దీంతో కోర్టు తీర్పును ట్రోల్ చేయడమేంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.
'ఓజీ' సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోనూ హైకోర్టు ఇటీవల రద్దు చేసింది. దీనిపై ప్రొడ్యూసర్ తరఫు లాయర్ రివ్యూ కోరగా తమ నిర్ణయంలో మార్పు లేదని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని కొనసాగిస్తూ కీలక ఆదేశాలు చేసింది. టికెట్ రేట్లు పెంపుపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరుతూ.. అసలు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కౌంటర్‌లో తెలిపాలని కోరింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయని హైకోర్టు ధర్మాసనం స్పష్ఠం చేసింది.