తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ కామెడి షో కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కంటెస్టెంట్స్ వెళ్లిపోతున్నా, జడ్జీలు మారుతున్నప్పటికీ ఈ షోకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఎంతో మంది కమెడియన్లు ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ షోపై కమెడియన్ అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జబబర్దస్త్’ కామెడీ షోకు దిష్టి తగిలిందని చెప్పుకొచ్చాడు. మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరి దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని, మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుండని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
“మా ‘జబర్దస్త్’ టీమ్ కు దిష్టి తగిలింది.. జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్‌తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టే కంటెస్టెంట్లు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం.
కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు.
ఎవరి దిష్టి తగిలిందో, ఎవరైనా ఏదైనా అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. సమయం వెనక్కి వెళ్తే బాగుండు, ఆరోజులు తిరిగి వస్తే బాగుండు, అందరినీ నవ్వించే ‘జబర్దస్త్’కి మళ్లీ నవ్వే రోజులు వస్తే బాగుండు” అంటూ అదిరే అభి రాసుకొచ్చారు.