హీరోయిన్ నిక్కీ గల్రాని.. అలా 50 లక్షలు మోసపోయిందట..!

Actress Sanjjanaa's Sister Nikki Galrani in Trouble. తాజాగా దక్షిణాది నటి, హీరోయిన్ నిక్కీ గల్రాని ఓ కేటుగాడి చేతిలో50 లక్షల రూపాయలను అడ్డంగా మోసపోయింది.

By Medi Samrat  Published on  16 April 2021 7:52 AM GMT
Nikki Galrani

సినిమా స్టార్స్ తమకు వచ్చే ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో పెడుతూ ఉంటారు. ఏ మల్టీ ప్లెక్స్ లలోనో, హోటల్స్ పైనో, ల్యాండ్ మీదనో చాలా మంది స్టార్స్ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళను కూడా అడ్డంగా మోసం చేసేస్తూ ఉంటారు కొందరు కేటుగాళ్లు. తాజాగా దక్షిణాది నటి, హీరోయిన్ నిక్కీ గల్రాని ఓ కేటుగాడి చేతిలో అడ్డంగా మోసపోయింది. ఏకంగా 50 లక్షల రూపాయలను నిక్కీ సదరు వ్యక్తి చేతుల్లో పెట్టేసి మోసపోయింది.

'కృష్ణాష్టమి', 'మరకతమణి', 'మలుపు' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్ నిక్కీ గల్రానీ పరిచయమే..! ఈమె తాను సంపాదించిన డబ్బును ఓ హోటల్ యజమాని చేతిలో పెట్టి మోసపోయింది. ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్ ను ప్రారంభించాడు.. నిక్కీ రూ. 50 లక్షల వరకూ పెట్టుబడిగా పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా తాను నెలకు రూ. 1 లక్ష ఇస్తానని నిఖిల్ హామీ ఇచ్చాడు. పెట్టుబడి పెట్టి చాలా కాలమైనా అతడు ఆమెకు డబ్బు అసలు ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె, పోలీసులను ఆశ్రయించి, ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ యజమానిని పిలిచి విచారిస్తున్నామని తెలిపారు.

2016లో కేఫ్‌ పెట్టాలని నిఖిల్ హెగ్డే ఆశ్రయించాడని, ఇందుకు గానూ తాను 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ప్రతీ నెలా తనకు లక్ష రూపాయలు చెల్లించాలని, ఇప్పటివరకు పేమెంట్‌ చేయలేదని నిక్కీ గల్రానీ తన ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని నెలలుగా నా ఫోన్‌కాల్స్‌కు సైతం సమాధానం ఇవ్వడం లేదని పేర్కొంది. నిక్కీ గల్రానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్‌ కోర్టులో విచారణకు హాజరు కావాలని అతడికి నోటీసులు పంపారు. శాండిల్ వుడ్‌లో గతేడాది డ్రగ్స్‌ రాకెట్‌ కేసు వెలుగు చూసింది. బుజ్జిగాడు ఫేమ్ హీరోయిన్‌ సంజన గల్రానీ మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. సంజన చెల్లెలే నిక్కీ గల్రానీ.


Next Story