ప్రముఖ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్ని రోజుల క్రితం కన్నుమూశారు. తాజాగా మీనా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే (ఆగస్ట్ 13)ను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని, మీరు కూడా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోండంటూ సోషల్ మీడియా ద్వారా కోరారు మీనా. లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేస్తే మీనా భర్త విద్యాసాగర్ బతికేవారని కూడా వైద్యులు తెలిపారు. సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు. ఈ కారణంగానే మీనా తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో 'ప్రాణాలను కాపాడడం కంటే గొప్ప కార్యం మరొకటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, అవసరమైనవారికి అవయవాలు దానం చేస్తే వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో కళ్లారా చూశాను. మా విద్యాసాగర్‌కు దాతలు దొరికి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చట. అవయవ దానం గొప్పదనం గురించి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నేను నా అవయవాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను' చెప్పుకొచ్చారు మీనా. మీనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.