45 ఏళ్ల స్నేహం ఈ రోజుతో ముగిసింది

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌తీష్ కౌశిక్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2023 9:07 AM IST
Anupam Kher, Actor Satish Kaushik,

Anupam Kher, Actor Satish Kaushik,



బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌తీష్ కౌశిక్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 67 సంవ‌త్స‌రాలు. ఈ రోజు తెల్ల‌వారుజామున కౌశిక్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడ‌ని సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

కౌశిక్ ఫోటోని షేర్ చేస్తూ.. "మ‌ర‌ణం అనేది అంతిమం అని నాకు తెలుసు. అయితే.. నేను బ‌తికి ఉన్న‌ప్పుడు నా ప్రాణ స్నేహితుడు కౌశిక్ గురించి ఇలా రాస్తాన‌ని అనుకోలేదు. మాది 45 ఏళ్ల‌కు పైగా స్నేహం. ఇక స‌తీష్ లేకుండా జీవితంలో ముందుకు సాగ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం." అంటూ అనుప‌మ్ ఖేర్ రాసుకొచ్చారు. స‌తీష్ కౌశిక్ మృతితో బాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు నివాళి అర్పిస్తున్నారు.

1956 ఏప్రిల్‌లో హ‌ర్యానాలో కౌశిక్ జ‌న్మించారు. 1983లో 'మసూమ్' చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్‌గా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 1990 లో 'రామ్ లఖన్', 1997 లో 'సాజన్ చలే ససురాల్' చిత్రాల‌కు గాను ఉత్తమ హాస్యనటుడిగా ఫిల్మ్ ఫేర్ ను అందుకున్నారు. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా త‌నదైన ముద్ర వేశారు.

1993లో 'రూప్ కా రాణీ చోరోకా రాజా' చిత్రానికి తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌మెడియ‌న్‌గా, స్క్రీన్ రైట‌ర్‌గా, ద‌ర్శ‌క‌నిర్మాత‌గా రాణించారు. ఆయ‌న‌కు భార్య‌, కూతురు ఉన్నారు.

Next Story