పొన్నాంబళం.. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో విలన్ గా చేశాడు. అతడిని చూస్తే చాలు పిల్లలు భయపడిపోయేవారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కూడా తనదైన శైలిలో విలనిజాన్ని చూపించి ప్రత్యేకమైన మార్కును చూపించాడు. సినిమాల్లో అంటే విలన్లను అంతం చేయడమే హీరోల కర్తవ్యం. సినిమా బయట ప్రాణాలను నిలబెడితేనే హీరో అవుతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ మంచి పనిని పొన్నాంబళం బయట పెట్టాడు. చిరంజీవి అన్నకు ఎంతో థాంక్స్ అంటూ పొన్నాంబళం ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా, ఆయన శస్త్రచికిత్స కోసం చిరంజీవి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు.
పొన్నాంబళం కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి రెండు లక్షల రూపాయలను ఆన్ లైన్ లో బదిలీ చేశారు. మీ పేరులోనే ఆంజనేయస్వామి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటున్నా... మీరు పంపిన డబ్బు నాకు చాలా ఉపయోగపడింది... ధన్యవాదాలు అన్నయ్యా... జై శ్రీరామ్... అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు పొన్నాంబళం.
చిరంజీవి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! చిరంజీవి కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ గత నెలలో కరోనాతో మరణించడం చిరంజీవిని తీవ్రంగా కలచి వేసింది.తన కారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. కిలారి జయరామ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆలిండియా చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబసభ్యులకు అందించారు. ఇలా ఎన్నో మంచి పనులను చిరంజీవి చేసుకుంటూ వెళుతున్నారు.