కార్తీక్.. ఈయన పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులకు 'సీతాకోకచిలుక', 'అభినందన,'అన్వేషణ' 'మగరాయుడు' వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారనుకోండి. పలు తెలుగు, తమిళ సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూ ఉన్నారు కార్తీక్. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు.
తాజాగా తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలైయ్యారు. 'మనిద ఉరిమై కట్చి అనే పార్టీని కూడా స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసాడు. ఈ ఎన్నికల్లో కూడా ఈయన పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. ఇక 'మనిద ఉరిమై కట్చి' అంటే మానవ హక్కుల పార్టీ అనే అర్ధం కూడా ఉంది. ప్రస్తుతం తమిళనాట ఎన్నికల జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈయన బీజేపీ- అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈయన శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరారు. ప్రచారంలో భాగంగా ఈయన శనివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.