నటుడు విజయ్ కాంత్ కన్నుమూత
ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 28 Dec 2023 9:42 AM ISTప్రముఖ నటుడు విజయ్ కాంత్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కరోనా సోకడంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న మధురైలో కె.ఎన్.అలగర్‌స్వామి, ఆండాళ్ అజగర్‌స్వామి దంపతులకు విజయ్‌కాంత్ జన్మించారు. 1990 జనవరి 31న ప్రేమలతను ఆయన వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్. వారి రెండో కుమారుడు షణ్ముగ 2015లో 'సగప్తాహం' సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కాంత్ సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు.
విజయ్‌కాంత్ తన యాక్టింగ్ కెరీర్‌లో దాదాపు 154 సినిమాల్లో నటించారు. డ్యూయల్ రోల్స్‌కు పేరొందిన ఆయన 20కిపైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆయన సినిమాలు హిందీ, తెలుగులోకి డబ్ అయ్యేవి. ఆయన నటించిన మొదటి సినిమా 'ఇనిక్కుం ఇలామై (1979)'.. కాగా, చివరిసారిగా 2015లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సగప్తం'లో అతిథి పాత్రలో కనిపించారు. విజయ్‌కాంత్ అంటే ఈ తరం వాళ్లకు ఎక్కువగా తెలియకపోయినా 90ల్లో ఆయన మంచి పేరు సంపాదించారు. విజయ్‌కాంత్ నటించిన 100వ చిత్రం 'కెప్టెన్ ప్రభాకర్' విజయం సాధించడంతో కెప్టెన్ విజయ్‌కాంత్‌గా స్థిరపడిపోయారు. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి.
విజయ్, సూర్య వంటి సూపర్ స్టార్ల చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో విజయ్‌కాంత్‌గా పరిచయమైన ఆయన అసలు పేరు విజయరాజ్ అలగర్‌స్వామి, సినిమాలకు దూరమై తర్వాత విజయ్‌కాంత్ రాజకీయాలకు దగ్గరయ్యారు. తమిళనాడులో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం పార్టీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2005లో ఈ పార్టీని స్థాపించారు. విజయ్‌కాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజకవర్గాల నుంచి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.