తమిళ నటుడు, సామాజిక కార్యకర్త వివేక్ మరణంపై దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! కరోనా టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని.. కరోనా కేసుల సంఖ్య పత్రికల్లో వేయడం నిలిపివేయండి. ఎందుకు ప్రజలను భయపెడుతూ చంపుతున్నారు.. అని ప్రశ్నించారు మన్సూర్. వివేక్ బాగానే ఉన్నాడుగా, ఎందుకు కరోనా టీకా వేశారు? ఆ టీకాలో ఎలాంటి సామర్ధ్యం ఉంది? దేశంలో కరోనా లాంటి వైరస్‌లు చాలా ఏళ్లుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మన్సూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొండాముత్తూరు నియోజకవర్గంలో పోటీచేసిన నేను ప్రచారంలో భిక్షగాళ్ల పక్కన, కుక్క పక్కన కూడా కూర్చున్నాను. నాకు కరోనా రాలేదే? మాస్క్‌లు వేసుకోమని ఎందుకు చెబుతున్నారు? మనం వదిలే గాలి చెడ్డగాలి అని చెబుతున్నారు, మరి మాస్క్ వేసుకొంటే చెడ్డగాలిని మళ్లీ పీల్చాల్సి వస్తుందిగా? అని పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా వేయించుకున్నాక వివేక్ చనిపోయారంటూ మన్సూర్ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యల కారణంగా కరోనా టీకాపై అపోహలు పెరిగిపోయే అవకాశం ఉంది. దీంతో అధికారులు మన్సూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ స్పందించారు. మన్సూర్‌పై డీజీపీ త్రిపాఠీకి ఫిర్యాదు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని.. మన్సూర్‌పై వడపళని పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే మన్సూర్ అలీ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో వ్యాఖ్యానించానని, ఎలాంటి దురుద్దేశం లేదని మన్సూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.