బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్‌ను మంగళవారం ఉదయం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పూర్తి పేరు కంటే కేఆర్కే గానే ఎక్కువ మందికి సుపరిచితుడు. రెండేళ్ల క్రితం అతడు చేసిన ఓ వివాదాస్పద ట్వీట్‌పై కేసు నమోదు కాగా.. ముంబై విమానాశ్రయంలోనే మాలాడ్ పోలీసులు కేఆర్కేను అదుపులోకి తీసుకున్నారు. బోరివల్లి కోర్టులో నేడు ఆయన్ను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక తనను తాను సినీ విశ్లేషకుడిగా చెప్పుకుంటుంటాడు కేఆర్కే. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి హీరోలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలపై ఎల్లప్పుడూ నెగెటివ్ ట్వీట్లనే చేస్తుంటాడు. సినిమా విజయం సాధించిందా..? లేదా అన్నదానితో సంబంధం లేకుండా కేవలం వార్తల్లో ఉండటమే ముఖ్యం అన్నట్లు ఉంటాయి అతడి ట్వీట్లు. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైనప్పుడు కూడా నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.
ఇతడు ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్లపై గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నటుడు మనోజ్ బాజ్‌పాయ్ గతంలో కేసులు వేసిన సంగతి తెలిసిందే. కమల్ రషీద్ ఖాన్ పలు హిందీ, భోజ్ పురిచిత్రాల్లో నటించడంతో పాటు నిర్మించారు.