సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ఇంట్లో కైకాల జారీ పడగా.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల లక్ష్మీనారాయణ జన్మించారు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు సంతానం. గత 60 సంవత్సరాలుగా ఆయన సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఆయన 777 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన 'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదు పొందారు. ముఖ్యంగా యముడి పాత్రలకు కైకాల పెట్టింది పేరు. విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల సత్యనారాయణకే చెందుతుంది.