'నా వ్యక్తిత్వ హక్కులు కాపాడండి'.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ జూనియర్) తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
By - అంజి |
'నా వ్యక్తిత్వ హక్కులు కాపాడండి'.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ జూనియర్) తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సోమవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ముందు విచారణకు వచ్చింది. CS (COMM)–1305/2025 కేసులో భాగంగా దాఖలైన పలు మధ్యంతర దరఖాస్తులు (I.A. 45291/2024, I.A. 16181/2025, I.A. 29249/2025)పై కోర్టు వాదనలు వినిపించింది.
సీనియర్ న్యాయవాది జే సాయి దీపక్ వాదనలు వినిపిస్తూ, ఎన్టీఆర్ జూనియర్‌కు సంబంధించిన అభ్యంతరకరమైన, అనుమతి లేని కంటెంట్ సోషల్ మీడియా, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారంలో ఉందని, ఇది నటుడి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన జస్టిస్ అరోరా, నటుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం ఒక ఫిర్యాదుగా పరిగణించాలని సోషల్ మీడియా, ఈ–కామర్స్ సంస్థలను ఆదేశించారు. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లోపు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన అధికారిక ఉత్తర్వులు డిసెంబర్ 22న (తదుపరి విచారణ తేదీ) జారీ చేస్తామని కోర్టు తెలిపింది.
గతంలో ఇదే న్యాయమూర్తి, అభ్యంతరకరమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను అత్యవసరంగా తొలగించాలనుకునే వారు ముందుగా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌కు సంబంధించిన వ్యక్తిత్వ హక్కుల కేసులో ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో ఢిల్లీ హైకోర్టు పలు ప్రముఖుల వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది.
వాటిలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్, తెలుగు నటుడు నాగార్జున, బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సినీ నిర్మాత కరణ్ జోహార్ ఉన్నారు. అలాగే, జర్నలిస్టు సుధీర్ చౌదరీపై ఏఐ సాయంతో రూపొందించిన తప్పుడు వీడియోల ప్రసారం విషయంలో కూడా జస్టిస్ అరోరా వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్, పోడ్‌కాస్టర్ రాజ్ షమానీకి సంబంధించి కూడా ‘జాన్ డో’ ఉత్తర్వులు ఇచ్చారు.