విషాదం.. రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి.. ముఖ్య‌మంత్రి సంతాపం

Actor Deep Sidhu Dies In Accident.ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 7:45 AM IST
విషాదం.. రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి.. ముఖ్య‌మంత్రి సంతాపం

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ పంజాబ్ న‌టుడు దీప్ సిద్ధూ మృత్యువాత ప‌డ్డాడు. మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా హర్యానాలోని సోనిపట్ ద‌గ్గ‌ర రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యంలో సిద్దూ ప్ర‌యాణిస్తున్న కారు ఓ స్టేష‌న‌రీ ట్ర‌క్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిద్దూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. దీప్ సిద్ధూ మృతిని సోనిప‌ట్ పోలీసులు ధ్రువీక‌రించారు.

నటుడి మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంతాపాన్ని తెలిపారు.' ప్ర‌ముఖ‌ నటుడు మరియు సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌రం. ఆయ‌న మృతి ఎంతో బాధ‌ను క‌లిగించింది. ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అభిమానుల‌కు ధైర్యాన్ని ప్రసాదించాల‌ని ఆ భ‌గ‌వంతునిడి ప్రార్థిస్తున్నాను.' అని ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేరు.

1984లో పంజాబ్‌లోని ముక్త్ సర్‌లో దీప్ సిద్దూ జన్మించాడు. లా చ‌దివాడు. న్యాయ‌వాద వృత్తి కొన‌సాగిస్తూనే కొన్నాళ్లు మోడ‌ల్ ప‌ని చేశాడు. బాలాజీ టెలిఫిల్మ్స్‌కు లీగల్ హెడ్‌గా పనిచేసే క్ర‌మంలోనే ఏక్తా క‌పూర్ స‌ల‌హాతో న‌ట‌నలోకి అడుగు పెట్టాడు. 2015లో రామ్తా జోగి అనే సినిమాతో తెర‌గ్రేటం చేశాడు. ప‌లు పంజాబీ చిత్రాల్లో న‌టించాడు. రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాడు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన దీప్ సిద్ధూ.. గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కోసం ప్రచారం చేశాడు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..

గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేప‌ట్టిన ఉద్య‌మంలో పాల్గొన్నాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలో దీప్ సిద్ధూ పేరు ప్రధానంగా వినిపించింది. పార్లమెంటు ముట్టడిలో భాగంగా ఎర్రకోటపై సిక్కుల జెండా ఎగురవేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ స‌మ‌యంలో ఎర్ర‌కోట వ‌ద్ద చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో కీల‌క నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీతో సిద్దూ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. . కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి. రైతు ఉద్యమం దారి తప్పటానికి అతడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్దూ ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు.

Next Story