ఇంగ్లిష్‌ భాషలో బోధన ఒక మంచి చర్యే... కానీ....?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 11:57 AM GMT
ఇంగ్లిష్‌ భాషలో బోధన ఒక మంచి చర్యే... కానీ....?!

ముఖ్యాంశాలు

  • కొరియా, జపాన్ ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్
  • ఇంగ్లిషే శరణమన్న నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్
  • ఇంగ్లిష్ భాస రుద్దడంలో రాజకీయ ఉద్దేశాలు ఉండకూడదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక విద్యాలయాల్లో బోధనా భాషగా ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టబోతోంది. దీనితో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన గ్రామీణ వర్గాల ప్రజల చిరకాల ఆకాంక్షలను జగన్ అమలు చేసినట్టవుతుంది. సామాజిక ఆర్ధిక అభ్యున్నతికి ఇంగ్లేషే వాహకమని తల్లిదండ్రులు ఇప్పటికే గుర్తించారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, జపాన్, దక్షిణ కొరియా సహా ఇంగ్లీషేతర భాషా దేశాలన్నీ ఇంగ్లీషును బోధనా భాషగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. భారత దేశం లోనూ ఒక విదేశీ భాష స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి బోధనా భాషగా ఇంగ్లీషు రూపాంతరం చెందుతోంది. కార్పొరేట్ పాలనకు, శాస్త్రీయ పరిశోధనకు ఇంగ్లీషే మాధ్యమ భాష. ప్రపంచంలోని శాస్త్రీయ పరిశోధనలో 95 శాతం ఇంగ్లీషులోనే ప్రచురితం అవుతోంది. ప్రపంచస్థాయి పోటీని ఇంగ్లీష్ ద్వారానే తట్టుకుని మనుగడ సాగించడానికి వీలవుతుంది.

స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమాటిక్స్ లను చదివే విద్యార్థులు విశ్వభాషగా భావిస్తున్న ఇంగ్లీష్ పరిజ్ఞానంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కార్పొరేట్ రంగంలోనే ఇదే కథ. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీష్ నేర్పడం వల్ల విద్యార్థి ఉన్నత విద్య స్థాయిలో ఇంగ్లీషు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చునన్నది సర్వామోదం పొందిన వాస్తవం. 2013 లో కేంద్రప్రభుత్వం వెలువరించిన నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ సాయంతో రూపొందించిన ఈ నివేదికలో భారతీయ గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా విద్యార్థులకు ఇంగ్లీషు రాదని, ఫలితంగా వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్న ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అకౌంట్లు, సేల్స్, ఐటీ ఆదారిత సేవలు, బిపీఓ వంటి రంగాల్లో మన గ్రాడ్యుయేట్ట ఉద్యోగ సాధక సామర్థ్యం 2.59 నుంచి 21.27 శాతం వరకే ఉందని. ఇంగ్లీషు రాని కారణంగా 47 శాతం మంది ఉద్యోగానికి అనర్హులవుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.

అయినప్పటికీ ఒక వర్గం మేధావులు మాత్రం ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీషును బోధనాభాషగా ఉండకూడదని వాదిస్తున్నారు. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు, తెలుగు భాషా బోధకులు, తెలుగు వల్ల సమాజంలో గౌరవం పొందుతున్న వారు మాత్రం దీనిని గట్టిగా వ్యతిరేకించి గగ్గోలు పెడుతున్నారు. వారు దీని వల్ల మాతృభాష, మాతృ సంస్కృతి దెబ్బ తింటాయని వాదిస్తున్నారు. నిజానికి మాతృభాష అనేది పంథొమ్మిదో శతాబ్దంలో పుట్టిన భావన. తెలుగును మాతృభాష చేయడంలోనూ ఇంగ్లీషుదే కీలక పాత్ర అన్న విషయాన్ని వారు మరిచిపోతున్నారు.

తెలుగుపై అధ్యయనం చేసిన లీసా మిచెల్, ఒరియాపై పరిశోధనలు చేసిన అశోక్ మహాపాత్ర వంటి వారు ఇంగ్లీషులోకి అనువాదాల వల్ల, భాష ప్రామానీకరణ వల్ల స్థానిక భాషలు మాతృభాషలయ్యాయని ఋజువు చేశారు. ప్రింటింగ్ ప్రెస్ వల్ల కూడా ఈ ప్రక్రియ వేగవంతమైందని వారు చెబుతున్నారు. ఇంగ్లీషును ప్రాథమిక స్థాయిలో బోధనా భాషగా చేయడం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత కూడా ఊహాజనితమే కానీ వాస్తవాలపై ఆధారపడినవాదన కాదు.

చాలా మంది ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన జరగాలని, అప్పుడే లేలేత వయసులో ఉన్న పిల్లలు విషయాలను అర్థం చేసుకుంటారని చెబుతూంటారు. కానీ మాతృభాషలో ప్రాథమిక స్థాయిలో చదవని ఎన్నారై విద్యార్థుల మాటేమిటి? ఇలాంటివారు లక్షలాది మంది ఉన్నారన్నదీ తిరుగులేని వాస్తవమే. అయితే ఇంగ్లీషు వద్దనేవారిని తిట్టేందుకు జన సేన నేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లను, తద్వారా పుట్టిన పిల్లలను ప్రస్తావించనవసరం లేదు. ఇది చాలా తప్పు. నిందనీయం. కానీ ఇంగ్లీషును ప్రాథమిక స్థాయిలో బోధనా భాషగా చేయొద్దనడానికి పవన్ పై పనికి మాలిన విమర్శలను సైంధవుడిలా ఉపయోగించనవసరం లేదు.

ఇక అసలు విషయానికి వస్తే కేవలం ఇంగ్లీషు మీడియంలో బోధిస్తే బాల బాలికల విద్యాపరమైన అభివృద్ధి జరుగుతుందనడానికి వీల్లేదు. ప్రభుత్వం టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించాలి. బోధనా పద్ధతులను మెరుగుపరచాలి. పాఠ్యపుస్తకాల నాణ్యత పెంచాలి. అవి సమయానికి అందేలా చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఇంగ్లీషు మీడియంలో బోధించడం వల్ల కలగాల్సిన లాభాలు కలుగుతాయి. ఒక వేళ ఇదొక రాజకీయ ఉద్దేశం తో కూడుకున్న ప్రయత్నమే అయితే, సరైన వాతావరణాన్ని నిర్మించడంలో విఫలమైతే ఈ ప్రయోగం ఒక ఘోర తప్పిదంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

- జింకా నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్

Next Story