పాకిస్థాన్‌కు విజయాన్ని దూరం చేసిన బట్లర్, వోక్స్
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 10:15 AM ISTఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జాస్ బట్లర్-క్రిస్ వోక్స్ భాగస్వామ్యం పాకిస్థాన్ కు విజయాన్ని దూరం చేసింది. ఆరో వికెట్ కు వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించడంతో ఇంగ్లాండ్ ఓటమి అంచుల నుండి తప్పించుకుంది. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో శుభారంభాన్ని చేసింది.
పాకిస్థాన్ జట్టులో నిలకడ లేకపోవడమే పెద్ద సమస్య అని ఇప్పటికే చాలా సార్లు రుజువు అయ్యింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా అది స్పష్టంగా కనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడిన పాక్ 326 పరుగులు చేసింది. మసూద్ 156 పరుగులు చేయడం.. బాబర్ ఆజమ్ 69 పరుగులు, షాదాబ్ ఖాన్ 45 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ ను మొదటి ఇన్నింగ్స్ లో 219 పరుగులకు ఆలౌట్ చేసి తమ బౌలింగ్ లైనప్ సత్తా చూపించింది పాకిస్థాన్.
కానీ రెండో ఇన్నింగ్స్ కు వచ్చే సమయానికి పాకిస్థాన్ బ్యాట్స్మెన్ సీన్ రివర్స్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ చేసిన మసూద్ నిర్లక్ష్యమైన షాట్ ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్ లో యాసిర్ షా కొట్టిన 33 పరుగులే పాకిస్థాన్ జట్టులో అత్యధిక పరుగులంటే వారి బ్యాటింగ్ తీరును మనం అంచనా వేయొచ్చు. రెండో ఇన్నింగ్స్ లో 169 పరుగులకు ఆలౌట్ అయింది పాకిస్థాన్.
కష్ట సాధ్యం కాని లక్ష్యమైనప్పటికీ పాకిస్థాన్ ఇంగ్లాండ్ టాపార్డర్ ను కూల్చేసింది. 117 పరుగులకే 5 వికెట్లను ఇంగ్లాండ్ జట్టు కోల్పోవడంతో పాకిస్థాన్ జట్టులో విజయ గర్వం కనిపించింది. ఆ సమయంలో జాస్ బట్లర్-క్రిస్ వోక్స్ జంట అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. బట్లర్-వోక్స్ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆరో వికెట్ కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది ఈ జంట..! 107 పరుగుల లీడ్ ను మొదటి ఇన్నింగ్స్ లో అందుకున్న పాకిస్థాన్.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. బట్లర్ 75 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. క్రిస్ వోక్స్ 84 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఈ టెస్టులో నాలుగు వికెట్లు తీసి.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ వోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.