కరేబియన్ ప్రీమియర్ లీగ్.. ఆటగాళ్లందరికీ కరోనా టెస్టు.. రిజల్ట్ ఏమని వచ్చిందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 8:22 AM GMT
కరేబియన్ ప్రీమియర్ లీగ్.. ఆటగాళ్లందరికీ కరోనా టెస్టు.. రిజల్ట్ ఏమని వచ్చిందంటే..!

కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) నిర్వాహకులు తమ లీగ్ లో ఆడే ఆటగాళ్లు, అఫిషియల్స్ మొత్తం 162 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ట్రినిడాడ్ కు వెళ్లిన ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారందరికీ నెగటివ్ అని వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వారందరూ 14 రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉండనున్నారు. క్వారెంటైన్ లో ఉన్నప్పటికీ వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఉంటామని.. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే వారిని ప్రత్యేకంగా మరోచోట ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో కోవిద్ ప్రోటోకాల్స్ ను అందరూ పాటించాల్సిందేనని సిపిఎల్ నిర్వాహకులు వెల్లడించారు.

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లాక్ డౌన్ తర్వాత ప్రారంభం కానున్న అతిపెద్ద లీగ్ గా చెబుతూ ఉన్నారు. ఆగష్టు 18 న సిపిఎల్ మొదలుకానుంది.. సెప్టెంబర్ 10న ఫైనల్ నిర్వహించనున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో లోని రెండు స్టేడియంలలో ఈ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. అభిమానులకు ఎటువంటి అనుమతి ఉండబోదని గతంలోనే నిర్వాహకులు తెలిపారు. ఓవర్సీస్ ఆటగాళ్లకు దిగగానే టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు.

7 నుండి 14 రోజుల మధ్య ఇంకో రెండు టెస్టులను కూడా ఆటగాళ్లకు చేయనున్నారు. బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. ఆటగాళ్లంతా తప్పనిసరిగా ప్రోటోకాల్ ను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. గత సీజన్ రన్నరప్ గా నిలిచిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్ తో ఆగష్టు 18న తలపడనుంది.

ఫ్లైట్ మిస్ అయినందుకు టోర్నీ నుండి అవుట్..?

వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫేబియన్ ఆలెన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుండి అవుట్ అని నిర్వాహకులు చెబుతున్నారు. జమైకా నుండి బార్బడోస్ కు వచ్చే విమానంను అతడు మిస్ అవ్వడంతో టోర్నీ నుండి తప్పుకున్నట్లేనని చెబుతున్నారు. అంతర్జాతీయ విమానాల విషయంలో పలు నిబంధనలు ఉండడంతో కేవలం ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారానే ఫేబియన్ ఆలెన్ రావాల్సి ఉంది. ఆగష్టు 3న ఈ విమానం ఎక్కాల్సి ఉండగా ఫేబియన్ ఆలెన్ ఎక్కకపోవడంతో టోర్నమెంట్ లో పాల్గొనే అవకాశాలు సన్నగిల్లాయి. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ కు ఫేబియన్ ఆలెన్ ఆడాల్సి ఉంది.

Next Story