ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్.. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2020 8:23 AM GMT
ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్.. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటంటే..?

క్రికెట్ అభిమానులను సాధారణంగా సమ్మర్ లో మంచి మంచి మ్యాచ్ లను ఎంజాయ్ చేసే అవకాశం ఉండేది. కానీ కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలపాటూ ఎటువంటి క్రికెట్ మ్యాచ్ లు లేకుండా పోయాయి. ఎట్టకేలకు క్రికెట్ మ్యాచ్ లు మొదలు కాబోతున్నాయి. జులై 8న ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. 117 రోజుల తర్వాత సౌతాంప్టన్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుకాబోతోంది. ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్ నాయకత్వం వహిస్తూ ఉండగా, విండీస్ జట్టుకు జేసన్ హోల్డర్ నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు సరికొత్త రూల్స్ పాటించాల్సి ఉంది. ఆటగాళ్ల భద్రతా, ఆరోగ్యమే ముఖ్యమని అధికారులు భావిస్తూ ఉన్నారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జూన్ నెలలోనే సరికొత్త రూల్స్ ను తీసుకుని వచ్చింది. అనిల్ కుంబ్లే నాయకత్వం వహించిన ఐసీసీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(సి.ఈ.సి.) ఈ కొత్త రూల్స్ కు శ్రీకారం చుట్టింది. ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ కోవిద్-19 బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఇంగ్లాండ్ లో సిరీస్ ఆడడానికి విండీస్ ఆటగాళ్లు మూడు వారాల ముందు చేరుకున్నారు. వారిని క్వారెంటైన్ లో ఉంచారు. బుధవారం నాడు రెండు జట్లు తలపడనున్న నేపథ్యంలో రెండు జట్లు కొత్త రూల్స్ ను పాటించాల్సి ఉంటుంది.

కోవిద్-19 రీప్లేస్మెంట్స్:

కన్కషన్ సబ్స్టిట్యూట్ ను ఏడాది కిందట టెస్ట్ క్రికెట్ లోకి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోవిద్-19 సబ్స్టిట్యూషన్ రూల్స్ ను తీసుకుని వచ్చారు. ఆటగాళ్లలో కోవిద్-19 లక్షణాలు కనిపిస్తే వెంటనే మ్యాచ్ రెఫరీని సంప్రదించి ఆటగాన్ని మార్చే అవకాశం ఉంది.

సలైవా బ్యాన్:

బాల్ మీద ఉమ్మేయడం అన్నది ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. కానీ ఇకపై అలాంటిది చేయడానికి వీలు లేదు. ఉమ్మివేస్తే వార్నింగ్ లు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 5 పరుగుల పెనాల్టీ రన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సలైవా అన్నది బాల్ మీద ఉంటే తప్పకుండా క్లీన్ చేయాల్సిందే అని అంటున్నారు.

నాన్-న్యూట్రల్ అంపైర్లు:

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర దేశాలకు చెందిన అంపైర్లను తీసుకుని రావడం కుదరడమే.. దీంతో స్థానిక దేశస్థులు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ లో ఉన్న వారితోనే అంపైరింగ్ చేయించే అవకాశం ఉంది.

డి.ఆర్.ఎస్.లో కూడా మార్పులు:

గతంలో రెండు డి.ఆర్.ఎస్. రివ్యూలు ఒక్కో ఇన్నింగ్స్ కు ఉండేవి. ఇప్పుడు వాటిని మూడు చేశారు. తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు విధులు నిర్వహించే అవకాశం ఉండడంతో ఐసీసీ ఈ కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది.

కొత్త లోగో:

టెస్టు మ్యాచ్ లు అంటే కేవలం వైట్ అండ్ వైట్ తోనే సాగేవి. ఇంతకు ముందే పేరు, నెంబర్ ను తీసుకుని వచ్చారు. ఇప్పుడు లోగో కూడా ఆటగాళ్ల డ్రెస్ ల మీద ఉండనుంది. 32 చదరపు ఇంచీల కంటే తక్కువ సైజు ఉన్న లోగోలు, మరో మూడు చిన్న లోగోలకు అనుమతి ఇచ్చింది. మొత్తం నాలుగు లోగోలు ఇకపై టెస్ట్ జెర్సీలపై ఉండవచ్చు.

Next Story