తండ్రైన ఇంగ్లాండ్ క్రికెటర్..
By తోట వంశీ కుమార్ Published on 19 March 2020 1:13 PM GMTఇంగ్లాండ్ వన్డే, టీ20జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తండ్రి అయ్యాడు. అతని భార్య తారా ఈ నెల 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్ల క్రితం వివాహాం కాగా.. వీరిద్దరికి ఇదే తొలి సంతానం. ఇంగ్లాండ్ వన్డే ప్రపంచ కప్‌ను అందించిన నాయకుడిగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నాడు మోర్గాన్. అతని కెప్టెన్సీలోనే 2019లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఇక వరల్డ్‌కప్ సాధించిన సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అతను తండ్రి కావడం విశేషం.
ఐర్లాండ్‌కు చెందిన ఇయాన్ ఆస్ట్రేలియాకు చెందిన టారాను 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. టారా ఓ కంపెనీలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఈనెల 9న తాను మగబిడ్డ కు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ చిన్నారికి లియో లూయిస్ ఓలివర్ మోర్గాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపింది. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్‌లో మోర్గాన్‌ను రూ.5.25కోట్లకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 52 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోర్గాన్ 854 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత మార్చి 29న నిర్వహించాలని భావించగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. ఇంగ్లాండ్ జట్టు కూడా శ్రీలంక పర్యటన నుంచి వైదొలిగింది. మరోవైపు ఈ వైరస్ కారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ దేశంలోని క్రికెట్ కార్యకలాపాలను ఆపివేసింది. వైరస్ ఉధృతి తగ్గకపోతే రాబోయే సమ్మర్ కు సంబంధించిన కార్యకలాపాలను నిలిపి వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.