యూఏఈ చేరుకున్న ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు.. గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ
By తోట వంశీ కుమార్ Published on 18 Sept 2020 11:34 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లంతా ఇప్పటికే దుబాయ్ చేరుకుని ఆయా ఆయా ప్రాంచైజీలకు అందుబాటులోకి వచ్చారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్ కారణంగా.. ఈ రెండు జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకోవడం ఆలస్యం అయ్యింది. తాజాగా ఐపీఎల్‌లో పాల్గొనే 21 మంది ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. కాగా.. వారికి బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది.
నిబంధనల ప్రకారం యూఏఈ వచ్చిన వారంతా తప్పని సరిగా ఆరు రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలి. ఈ నిబంధన కారణంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావాల్సి ఉంది. అయితే.. ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య జరిగిన సిరీస్ కూడా బయో బబుల్ బుడగలోనే జరిగింది. ఒక బయో బబుల్ బుడలోంచి మరో బయో బబుల్ బడగలోకి అడుగుపెడుతుండడంతో.. క్వారంటైన్ సమయాన్ని తగ్గించాలని ప్రాంఛైజీలు అన్ని బీసీసీఐని కోరాయి.
దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి వెంటనే యూఏఈ వెళ్లి.. అక్కడి స్థానిక అధికారులతో చర్చించారు. దీనికి వారు కూడా అంగీకరించడంతో.. క్వారంటైన్ సమయాన్ని తగ్గించారు. ఆరు రోజులకు బదులు కేవలం 36గంటలు ఉంటే సరిపోతుంది. ఈ నిర్ణయం వల్ల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు టోర్నీ తొలి మ్యాచ్ నుంచే అందుబాటులోకి రానున్నారు. 'క్రికెటర్ల ఐసోలేషన్ సమయానికి సంబంధించిన సమస్య పరిష్కారమైంది. వారంతా 6 రోజులు కాకుండా 36 గంటలు విడిగా తమ హోటల్ గదుల్లో గడిపితే చాలు. ప్రతీ జట్టు తొలి మ్యాచ్‌లోనే తమ స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఇది మంచి అవకాశం' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.