భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు హతం

By సుభాష్  Published on  19 Oct 2020 10:24 AM IST
భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు హతం

మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలిలో పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. కోస్మి-కిస్నేలి అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని గడ్చిరోలి ఎస్పీ తెలిపారు. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో కూంబింగ్‌ ఆపరేషన్‌ పెంచాయి. మావోయిస్టులు ఉన్నరన్న సమాచారం తెలుసుకున్న సీ60 కమాండో ఫోర్సెస్‌ కూబింగ్‌ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మావోల కోసం గాలింపుఏ చర్యలు చేపడుతుండటంతో తారసపడిన మావోలు పోలీసులపై ఎదురు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేక దళాలు మావోలపై కాల్పులకు దిగారు. మావోయిస్టు మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇంకా మావోల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

కాగా, ఆదివారం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. మంగపేట మండలంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం అయినట్లు పోలీసులు వెల్లడించారు. రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. అయితే మృతులు ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వర్‌రావును హతమార్చిన వారుగా గుర్తించారు పోలీసులు.

అయితే ఇటీవల కాలంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోకి మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారి కోసం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఎన్‌కౌంటర్‌లు కూడా జరిగి కొందరు మావోయిస్టులు సైతం హతమయ్యారు. అప్పటి నుంచి పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మావోల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్‌కౌంటర్‌ కలకలం రేపుతోంది. గత కొన్నేళ్లుగా మావోయిస్టుల కదలికలు లేకపోవడంతో ఊపిరి పిల్చుకున్న పోలీసులకు.. తాజాగా మావోల కదలికలతో తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయనుకునే సమయంలో మళ్లీ కొనసాగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు కరోనా.. మరో వైపు వరదలు, మావోల కదలికలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి.

Next Story