భారత క్రికెటర్లకు అవమానం..!
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 4:18 PM ISTభారత్ మహిళల జట్టు తొలిసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరింది. అయితే ఫైనల్‌లో ఆస్త్రేలియా జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. స్వదేశానికి వచ్చిన మహిళల జట్టుకు కనీసం స్వాగతం పలికేవారు కరువయ్యారు. ఆసియా జట్లలో తొలిసారి ఫైనల్ చేరిన ఘనతను సొంతం చేసుకుంది. టోర్నీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది.. అది కూడా ఫైనల్‌లో. అంత మంచి ప్రదర్శన కనబరిచిన మహిళల జట్టుకి స్వాగతం పలికేందుకు బీసీసీఐతో పాటు అభిమానులు ఎవరూ విమానాశ్రయానికి వెళ్లలేదు. దీంతో అనామకుల తరహాలో ఎయిర్‌పోర్ట్ నుంచి వెలుపలికి వచ్చారు మహిళా క్రికెటర్లు.
తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ చేరిన మహిళల జట్టుకు ఫైనల్‌కు ముందు అన్ని వైపులా మద్దతు లభించింది. అయితే.. ఫైనల్ పరాభవం తరువాత కనీసం సపోర్టు చేసేవారు కరువయ్యారు. తాజాగా భారత్ గడ్డపై టీమ్ అడుగుపెట్టింది. కానీ.. ముంబయిలోని విమానాశ్రయంలో మహిళా క్రికెటర్లకి కనీసం స్వాగతం పలికేందుకు కూడా బీసీసీఐ నుంచి ఎవరూ వెళ్లలేదు. దీంతో.. తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన క్రికెటర్లు.. బాధతో విమానాశ్రయం నుంచి వెలుపలికి వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో.. బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు అభిమానులు. బీసీసీఐ మెన్స్ క్రికెట్‌కు ఇచ్చే ప్రాముఖ్యత ఉమెన్స్ క్రికెట్‌కు ఇవ్వడం లేదంటు విమర్శల జడివాన మళ్లీ మొదలైంది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఒక్క ఫైనల్ మ్యాచ్ మినహా టోర్నీ సాంతం అద్భుతంగా ఆడింది. లీగ్ దశ తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాని 17 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్ సేన.. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లని చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో.. లీగ్ దశ పాయింట్ల ఆధారంగా ఫైనల్‌కి అర్హత సాధించింది భారత్ జట్టు. అయితే.. అనూహ్యంగా ఫైనల్‌లో తడబడి తొలి టైటిల్ చేజిక్కించుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఓటమి అనంతరం మహిళా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే.