బస్సుపై తెగిపడ్డ 11కేవీ విద్యుత్‌ తీగలు.. ఒక్క‌సారిగా 60 మంది ప్రయాణికులు..

By సుభాష్  Published on  26 Feb 2020 3:20 PM GMT
బస్సుపై తెగిపడ్డ 11కేవీ విద్యుత్‌ తీగలు.. ఒక్క‌సారిగా 60 మంది ప్రయాణికులు..

వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తిలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు 11కేవీ విద్యుత్‌ తీగలు తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్‌ తీగలు కూడా బస్సుపై తెగిపడటంతో ట్రాన్స్‌ ఫార్మర్‌ ఫీజు కొట్టేసి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పి బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే..

రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు బొమ్మకంటి రాజు (40), బొమ్మకంటి రాణి (33) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వారి బైక్‌పై వెళ్తున్న రాణి సోదరి కవితకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు వరంగల్‌ - ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ ఏర్పడటంతో వాహనాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో వరంగల్‌ నుంచి తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్నా కారణంగా నిలిచిపోయింది. కాగా, డ్రైవర్‌ ఇతర మార్గం నుంచి బస్సును పోనిచ్చేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లను డ్రైవర్‌ గమనించకపోవడంతో 11కేవి విద్యుత్‌ తీగలు బస్సును తాకాయి. విద్యుత్‌ ప్రవహించడంతో బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోగా, విద్యుత్‌ తీగలు కూడా తెగిపడి ట్రాన్స్‌ ఫార్మర్‌ ఫీజు కొట్టేసి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్‌ సిబ్బంది వెంటనే ఆ రూట్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఒక వేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుంటే బస్సులో ఉన్న ప్రయాణికులంతా మృతి చెంది ఉండేవారని, ప్రయాణికులు డ్రైవర్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

Next Story
Share it