ముఖ్యాంశాలు

  • విద్యుత్‌ తీగల్లో చిక్కుకున్న పిల్ల కొండముచ్చు
  • కాపాడి మానవత్వం చాటుకున్న స్థానికులు
  • కృష్ణా జిల్లా నందిగామలో ఘటన

కృష్ణా జిల్లాలో మనిషి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్న ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ కొండముచ్చుకు తామున్నమంటూ స్థానిక ప్రజలు.. సాయం చేశారు. చివరకు పిల్ల కొండముచ్చును కాపాడి.. తల్లి కొండముచ్చు మనసు గెలుచుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందిగామలో శనివారం రోజున కొన్ని కొండముచ్చులు.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి.. ఇళ్లపై దూకుతూ, గోడలు పాకుతూ అటుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ కొండముచ్చ ప్రమాదవశాత్తు కరెంట్‌ విద్యుత్‌ స్తంభం మీద తీగల్లో చిక్కుకుంది. పిల్ల కొండముచ్చుకు కరెంట్‌ షాక్‌ తగిలి విల విలలాడింది. బిడ్డను కాపాడుకోవాలని ఆ తల్లి ఎంతో ప్రయత్నించింది. చివరకు ఎలాంటి ఫలితం లేకపోయింది.

ఈ సంఘటన అక్కడున్న వారిని కలచివేసింది. అక్కడే ఉన్న కొంత మంది స్థానికుఉ వెంటనే విద్యుత్‌ ఉద్యోగులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. సీపీడీసీఎల్‌ పట్టణ ఏఈ దిబ్బయ్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నాడు. అనంతరం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి కొండముచ్చును కాపాడారు. అయితే ఆ పిల్ల కొండముచ్చు అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది.

వెంటనే స్థానికులు ఆ కొండముచ్చును స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఇంజెక్షన్లు చేసి చికిత్స అందించారు. ఆ తర్వాత తెరుకున్న కొండముచ్చును తీసుకెళ్లి గుంపులో కలిపారు. ఒక్కసారిగా పిల్ల కొండముచ్చు గుంపులో కలవడంతో ఆ తల్లిలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. తన దగ్గరికి వచ్చిన బిడ్డను గట్టిగా హత్తుకుంది. దీన్ని చూసిన స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.