తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2019 1:24 PM IST![తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/10/accident2.jpg)
తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు మధ్యగల ఘాట్‌రోడ్డులో ఓ పర్యాటక బస్సు బోల్తాపడింది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణించినట్టు సమాచారం.
క్షతగాత్రులను హుటాహుటిన రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు మారేడుపల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అడవిలోని పాములేరు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం.
కర్నాటక రాష్ట్రానికి చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో భద్రాచలం నుంచి చింతూరు మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేవని అధికారులు చెబుతున్నారు.
సంఘటనా స్థలికి చేరుకున్న మారేడుమిల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ శివరామకృష్ణ, పోలీసు బృందం సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు బస్సు ప్రమాదానికి గురికావడంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.