రాజ్యసభ రగడ.. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2020 5:31 AM GMT
రాజ్యసభ రగడ.. 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు లోక్‌సభలో ఆమోదం తర్వాత ఆదివారం రాజ్యసభ ముందుకు వచ్చాయి. అయితే.. ఈ బిల్లులపై ఓటింగ్ సమయంలో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదివారం చోటుచేసుకున్న గందరగోళంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని గందరగోళానికి కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు విపక్ష ఎంపీలపై అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్‌సీ), డోలాసేన్ (టీఎమ్‌సీ), రాజీవ్ వాస్తవ్‌ (కాంగ్రెస్) , రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్) , కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది.

డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును తోసిపుచ్చారు. సభా నియమాల ప్రకారం డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసం అమోదనీయం కాదన్నారు. రాజ్యసభలో ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని కల్పించి డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న గుర్తు చేస్తూ విప‌క్ష ఎంపీలు సోష‌ల్ డిస్టాన్స్‌, కోవిడ్ నిబంధ‌న‌లు విస్మ‌రించారన్నారు. రాజ్య‌స‌భ‌కు నిజంగా అది బ్యాడ్ డే అన్నారు. ఈ అనూహ్య పరిణామాల పట్ట తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఘటనను తీవ్రంగా ఖండించారు. నిరసనలకు కారణమైన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

చైర్మన్‌ నిర్ణయంపై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్న బిల్లులపై కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే తాము నిరసన వ్యక్తం చేశామన్నారు.

Next Story