ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు కరోనా బాధితులు మృతి

By సుభాష్  Published on  30 Jun 2020 5:02 AM GMT
ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు కరోనా బాధితులు మృతి

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంటే మరో వైపు అక్కడక్కడ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానో, ఇతర కారణాల వల్లనో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుని చికిత్స పొందుతున్న అమాయ రోగులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఈజిప్టు లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో చోటు చేసుకున్నఅగ్నిప్రమాదంలో ఏడుగురు కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగడానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని, ఎయిర్‌ కండిషనర్‌ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఈజిప్టు‌ ఉత్తర తీర ప్రాంతంలోని అలెగ్జాండ్రియా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కరోనా రోగుల్లో ఏడుగురు మరణించారని ఈజిప్ట్‌ అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో మంటలు ఒక్కసారిగా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో కొందరు ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో ఉన్న బెడ్లు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. మరో వైపు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసువచ్చారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గత నెలలో రాజధాని కైరోలోని ఒక కరోనా ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

కాగా, ఈజిప్టులో కూడా కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలోనే ఉంది. సోమవారం ఒక్క రోజే 1,566 మందికి కరోనా కేసులు నమోదు కాగా, 83 మంది మరణించారు. ఇప్పటి వరకూ ఈజిప్టులో 66,754 కేసులు నమోదు కాగా, 2,872 మంది మృతి చెందారు. ఇక ఇటీవల ఆ దేశంలో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చారు. కేఫ్‌లు, జీమ్‌ సెంటర్లు, క్లబ్‌లను తెరిచేందుకు గత శనివారం నుంచి అనుమతులు ఇస్తూ ఆంక్షలు ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం.

Next Story