తెలంగాణలో నేడే టెట్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!
TS TET 2022 exam today.తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) ఈ రోజు(ఆదివారం) జరగనుంది.
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2022 7:57 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) ఈ రోజు(ఆదివారం) జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టెట్ పరీక్ష జరగడం ఇది మూడోసారి. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు ఈ సారి పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా ఫలితాలను ఈ నెల27న విడుదల చేయనున్నారు.
పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. పేపర్-1పరీక్షకు 1480, పేపర్-2 పరీక్షకు 1,203పరీక్షా కేంద్రాలు కాగా.. రెండు పేపర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో 212, అత్యల్పంగా ములుగు జిల్లాలో 15 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-2 రాయడం ద్వారా బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. పేపర్-2 రాసే వారు కూడా పేపర్-1 రాసి ఎస్టీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్-1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశాలున్నాయి. టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.