తెలంగాణ రాష్ట్రంలో నేడు(గురువారం) పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in వెబ్‌సైట్లలోకి ఎంటరై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
కరోనా వైరస్ కారణంగా గడిచిన రెండుళ్లుగా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులను కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా ప్రభావం తగ్గడంతో.. నిబంధనలు పాటిస్తూ పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించారు. 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతంలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించగా.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేవలం 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు.