తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రీకౌంటింగ్‌కు 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలని అన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బాలికల సత్తా చాటారని బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయని, అందులో మొత్తం 5,05,813 మంది పరీక్ష రాశారని తెలిపారు. బాలురు 89.42 శాతం, బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత 91.31 శాతంగా నమోదైంది. నిర్మల్‌లో 99.05 శాతం అత్యధిక ఉత్తీర్ణత, వికారాబాద్ జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత 65.10 శాతం వచ్చింది.