తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు.. ఆరు పేపర్లే
Telangana SSC Exam TimeTable 2023 Released.తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక.
By తోట వంశీ కుమార్ Published on 29 Dec 2022 9:32 AM ISTతెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వంద శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేసేందుకు సెలవు రోజుల్లో కూడా స్పెషల్ క్లాసులు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని, సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధించాలన్నారు.
ఈ సారి పదో తరగతి వార్షిక పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లు ఉండేవి. కరోనా నేపథ్యంలో ఆరు పేపర్లకు కుదించారు. ఇక నుంచి ఆరు పేపర్లే ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి మాత్రమే కాదు 9వ తరగతికి కూడా ఆరు పేపర్లే ఉండనున్నాయి.
ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కులతో పరీక్షలు నిర్వహిస్తారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు ఉంటాయి. ఫిజిక్స్, బయోలజీకి సగం సగం మార్కులు ఉంటాయి. ఇక పరీక్ష సమయం మూడు గంటలు ఉండనుంది. అయితే సైన్స్ పేపర్ కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం ఇచ్చారు. వ్యాసరూప ప్రశ్నలకు ఇంటర్న్ ఛాయిస్ ఉంటుంది. అయితే.. సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు.
ఫిబ్రవరి, మార్చిలో ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
పరీక్షల షెడ్యూల్..
2023 ఏప్రిల్ త్రీ - ప్రథమ భాష
2023 ఏప్రిల్ 4 - ద్వితియ భాష
2023 ఏప్రిల్ 6 - ఇంగ్లీష్
2023 ఏప్రిల్ 8 - గణితం
2023 ఏప్రిల్ 10 - సైన్స్(భౌతిక, జీవ శాస్త్రాలు)
2023 ఏప్రిల్ 11 - సాంఘీక శాస్త్రం
2023 ఏప్రిల్ 12 - ఓరియంటల్ పేపర్ -1, ఒకేషనల్ కోర్సు
2023 ఏప్రిల్ 13 - ఓరియంటల్ పేపర్ -2