తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ పై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందుగానే సంక్రాంతి సెలవులను ఇచ్చారు. సెలవులు ముగిసే లోపు రాష్ట్రంలో అప్పటి కరోనా పరిస్థితులను బట్టి సెలవులను పొడిగించే అవకాశం ఉంది.
ఇక సోమవారం తెలంగాణలో 482 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 212 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,82,971 చేరింది. ఇప్పటి వరకు 6,74,892 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,031కి చేరింది.