తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు మాత్రమే జూన్ నెల చివరాఖరున జరగనున్నాయి. మిగిలిన 5 ప్రవేశ పరీక్షలను జులైలో జరపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఇంటర్‌మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల పరీక్షలు మే 7తో ముగియనున్నాయి. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల చివరి పరీక్షలు జూన్ మొదటి వారంలో పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ నెలాఖరులో ఎంసెట్, ఈసెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తదుపరి ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పీజీ ఇంజినీరింగ్, లాసెట్‌లను జులై నెలలో చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. జూన్‌లో వారికి చివరి సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి. జులైలో 10 రోజుల సమయం ఇచ్చి ప్రవేశ పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఇక రేపటి నుండి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. 9వ తేదీన పీజీఈసెట్, లాసెఎట్ కమిటీ సమావేశాలు, 10వ తేదీన ఎడ్‌సెట్ కమిటీ సమావేశం జరగనుంది. 11వ తేదీన పీఈసెట్ సమావేశం జరపాలని భావిస్తున్నారు. అయితే ఆయా ప్రవేశ పరీక్షల తేదీలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.