తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
Telangana 10th class Results released.తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2022 12:19 PM ISTతెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11.30గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీహెచ్ఆర్‌డీ)లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in వెబ్‌సైట్లలోకి ఎంటరై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
పది ఫలితాల్లో 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు సత్తా చాటారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థుల్లోనూ బాలికలదే పైచేయి. బాలికలు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 46.21 శాతం పాసయ్యారు. 3,007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పదిహేను స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా.. గతంలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించగా కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి కేవలం 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు.