తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఇప్పటికే ఖరారు చేసిన దసరా సెలవుల్ని తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదించింది. దసరాకు 14 రోజులకు బదులుగా 9 రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు సూచించింది. భారీ వర్షాలతో జూలై 7 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో 2022 -23 విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయినట్లు వెల్లడించింది.
వీటిని భర్తీ చేసేందుకు మరో ప్రతిపాదనను కూడా ఉంచినట్లు తెలుస్తోంది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనకు మంగళవారం లేఖరాశారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.