ఏపీ: ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా విడుదల
RGUKT Integrated Course Admission List Released In Andhrapradesh. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్జీయూకేటీ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు
By అంజి Published on 29 Sept 2022 3:20 PM ISTముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్జీయూకేటీ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలో 77 శాతం మంది ఆర్‌జీయూకేటీలో సీట్లు సాధించినట్లు తెలిసింది. మొదటి 20 ర్యాంకులు ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్ల విద్యార్థులు సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆర్‌జీయూకేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్త ఒంగోలు క్యాంపస్ ప్రారంభించామని, 10వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు పారదర్శకంగా జరుగుతాయని, ఈబీసీ కోటాలో 400 సీట్లు కేటాయించామని బొత్స తెలిపారు. రాష్ట్రంలోని కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్‌లు పెరిగాయని, ఇన్ఫోసిస్ కూడా తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ఫలితాల విడుదలను అధికారులే చూసుకోవాలన్నారు. విధానపరమైన నిర్ణయాలు ఉంటేనే తనను పిలవాలని అధికారులను ఆదేశించారు.
రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 2022-23 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల పీయూసీ, నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 1న దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిశీలన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక జాబితాను గురువారం విడుదల చేసింది. ఛాన్సలర్ కేసిరెడ్డి మాట్లాడుతూ పదో తరగతి మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ ఫలితాలను వెల్లడించామని, 77 శాతం ప్రభుత్వ బడుల్లో చదివిన వారికే ఆర్జీయూకేటీలో ప్రవేశాలు కల్పిస్తు న్నామని తెలిపారు.