2020లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగా.. 1.92 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. సాధారణంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ పరీక్షలు నిర్వహించడానికి వీలుపడలేదు. కాగా..సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీసం మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించారు. దీంతో ఫస్టియర్ విద్యార్థులను కూడా ఇదే విధంగా ఉత్తీర్ణులుగా ప్రకటించాలన్న డిమాండ్ ఉంది. ఇంటర్ బోర్డు అధికారులు కూడా ఈ డిమాండ్‌కు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఒకవేళ ఎక్కువ మార్కులు కావాలంటే వారు మళ్లీ మేలో పరీక్షలు రాసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది(2021) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే నె 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీతో, అన్ని పరీక్షల్ని 24వ తేదీతో పూర్తిచేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ మేరకు అధికారులు టైంటేబుల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. గతంలో ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించి మే రెండో వారానికి పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు.. మే 24 నుంచి చివరి విడత జేఈఈ మెయిన్ ఉన్నందున ఇంటరల్ పరీక్షలను మే 3న ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో మినహాయించేది లేదని అధికారులు తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలైన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.