తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2 నుంచి పాఠశాలలు బంద్ అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ వార్తల సారాంశం. తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత నిచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పాఠశాలలు అన్ని యథావిధిగా నడుస్తాయని చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ సీఎం కేసీఆర్ ఇదే విషయాన్ని చెప్పారని మంత్రి తెలిపారు. కొవిడ్ నిబంధనలు కొనసాగిస్తూ.. పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లను వాడడంతో కరోనాను కట్టడి చేయాలని మంత్రి సూచించారు. ఇక పాఠశాలల యాజమాన్యాలు కూడా అన్ని రకాల కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.