ఏపీలో విద్యాసంస్థ‌ల సెల‌వుల పొడిగింపుపై క్లారిటీ

Minister Adimulapu Suresh says no extending sankranti holidays in ap.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాఠ‌శాల‌ల సెలవుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 10:36 AM GMT
ఏపీలో విద్యాసంస్థ‌ల సెల‌వుల పొడిగింపుపై క్లారిటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాఠ‌శాల‌ల సెలవుల పొడ‌గింపుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్ట‌త నిచ్చారు. స్కూళ్ల‌కు సెలవులు పొడిగించే ఆలోచ‌న లేద‌ని చెప్పారు. దీంతో ఏపీలో పాఠ‌శాల‌లకు సంక్రాంతి సెల‌వులు పొడిగిస్తారు అనే ఊహాగాల‌కు తెర‌ప‌డిన‌ట్లు అయ్యింది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి సెల‌వులు ఇచ్చింది. జ‌న‌వ‌రి 8 నుంచి 16 వ‌ర‌కు పాఠ‌శాల‌లు, కాలేజీల‌తో పాటు అన్ని విద్యాస్థంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 17 నుంచి అన్ని విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం కానున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఇక ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మ‌రో రెండు, మూడు వారాలు కేసులు విప‌రీతంగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో అన్ని విద్యాస్థంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా మంత్రి వ్యాఖ్య‌ల‌తో ఈ వార్త‌ల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో విద్యాసంస్థ‌ల‌కు ఆ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం సెల‌వులను పొడిగించింది. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. ఈ మేర‌కు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్న నేప‌థ్యంలో పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అంత‌క‌ముందు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మూడు రోజుల ముందుగానే అంటే జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచే సెల‌వుల‌ను ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక సెల‌వులు పొడిగించిన నేప‌థ్యంలో విద్యార్థులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం అధికారులు ఆదేశించింది. ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించుకోవాలని సూచించింది.

Next Story