జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

JEE Mains 2021 postponed. జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2021 8:22 AM GMT
JEE Mains

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఐఐటీ-జేఈఈ(మెయిన్) ప‌రీక్ష‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేసిన ప్ర‌క‌ట‌న‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఐఐటీ-జేఈఈ(మెయిన్) ప‌రీక్ష‌కు సంబంధించి నాలుగు సెష‌న్ల‌కు గానూ.. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి, మార్చిలో రెండు సెష‌న్లు పూర్తి అవ్వ‌గా.. మూడో సెష‌న్ ప‌రీక్ష‌ల్ని ఈ నెల 27, 28, 30 తేదీల్లో నిర్వ‌హించాల్సి ఉంది. అయితే.. క‌రోనా కార‌ణంగా ఈ ప‌రీక్షల్ని వాయిదా వేసింది. జేఈఈ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను 15 రోజుల ముందుగా విద్యార్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.

కాగా.. గ‌డిచిన 24 గంట‌ల్లో 15,66,394 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,61,500 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌ 1,47,88,109కి చేరింది. నిన్న ఒక్క రోజే 1501 మంది ఈ మ‌హ‌మ్మారితో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టికి ఒక్క రోజు వ్య‌వ‌ధిలో ఇంత మంది మృత్యువాత ప‌డ‌డం ఇదే తొలిసారి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 1,77,150కి చేరింది. నిన్న 1,38,423 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,28,09,643కి చేరింది. దేశంలో ప్ర‌స్తుతం 18,01,316 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. నిన్న 26.84 ల‌క్ష‌ల మందికి పైగా టీకాలు వేయ‌గా.. మొత్తంగా టీకాలు పొందిన వారి సంఖ్య 12.26కోట్లు దాటింది.Next Story