Telangana: ఇంటర్‌ సెకండియర్‌ హాల్‌టికెట్‌పై ఫస్టియర్‌ మార్కులు

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల హాల్‌టికెట్‌పై ఇక నుంచి ఫస్టియర్‌ మార్కులు, పాస్‌/ ఫెయిల్‌ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది.

By -  అంజి
Published on : 25 Dec 2025 7:05 AM IST

Inter Model Hall Tickets, Parents Phones, Telangana, Inter Board

Telangana: ఇంటర్‌ సెకండియర్‌ హాల్‌టికెట్‌పై ఫస్టియర్‌ మార్కులు

హైదరాబాద్‌: ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల హాల్‌టికెట్‌పై ఇక నుంచి ఫస్టియర్‌ మార్కులు, పాస్‌/ ఫెయిల్‌ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్టియర్‌ మార్కులు తక్కువొచ్చినా, సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినా తల్లిదండ్రులకు చెప్పడం లేదు. రెండో ఏడాది చివరిలో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్‌ పెట్టడంతో పాటు విద్యార్థుల్లో జవాబుదారీతనం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది.

కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు నెలల ముందే తల్లిదండ్రుల వాట్సాప్‌నకు విద్యార్థుల హాల్‌టికెట్లను పంపనున్నారు. హాల్‌ టికెట్‌ నంబర్‌, పరీక్షా కేంద్రం అడ్రస్‌తో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రుల దగ్గర స్మార్ట్‌ ఫోన్‌ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

అలాగే సెకండియర్‌ హాల్‌టికెట్లపై ఫస్టియర్‌ మార్కుల లింక్‌ ఇవ్వనున్నారు. దీంతో పేరెంట్స్ తమ పిల్లలు ఏ సబ్జెక్టులో పాస్‌ అయ్యారు.. వేటిలో ఫెయిల్‌ అయ్యారో తెలుసుకోవచ్చు. ఇది 10 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుంది.

Next Story