తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..?
Inter exams starts from May 2nd.తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2022 10:33 AM ISTతెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను మే 2 నుంచి నిర్వహించాలని ఇంటర్ బోర్డు బావిస్తోంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. మే 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించాలని బోర్డు బావిస్తోంది. ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ఎగ్జామ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు రూపొందించినట్లు సమాచారం.
ఏప్రిల్‌లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికీ వరకు బోర్డు చెబుతూ వస్తోంది. అయితే.. ప్రత్యక్ష తరగతులు ఆలస్యం కావడంతో పాటు సంక్రాంతి తరువాత ఫిబ్రవరి వరకు కరోనా తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం కావడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో కాస్త ఆలస్యంగా మే నెలలో నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేయనున్నారు.
ఇక రాష్ట్రంలో మొత్తం 9 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. గతేడాది కరోనా కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో ద్వితియ సంవత్సరం విద్యార్థులను ఫస్టియర్ మార్కుల ఆధారంగా పాస్ చేశారు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు గతేడాది అక్టోబర్‌లో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో కేవలం 49 శాతం మందే పాస్ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కనీస మార్కులు ఇచ్చి పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మార్కులతో సంతృప్తిపడని వారు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని తెలిపింది.
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలను మే నెలలోనే నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్థసంవత్సరం పరీక్షలు పూర్తి చేసిన అధికారులు వార్షిక పరీక్షలపై దృష్టి సారించారు. కరోనా ఉధృతి లేకపోతే మే నెలలో పరీక్షలను నిర్వహించాలని అధికారులు బావిస్తున్నారు.