తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎండలు మండిపోతుండడంతో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల(మార్చి) 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 7.45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 వరకు కాస్లులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది.
అలాగే వేసవి సెలవులపై క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12 పునఃప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 5 తరగతుల వారికి ఏప్రిల్ 17తో పరీక్షలు ముగియనుండగా, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షలు ఉండనున్నాయి. పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడించనున్నారు.