ఏప్రిల్ నుంచి ఏపీలో ఒంటిపూట బడులు.. మే నుంచి వేసవి సెలవులు
Half Day schools in AP From April 1st week.తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో
By తోట వంశీ కుమార్ Published on 16 March 2022 5:09 AM GMTతెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. తాజాగా మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. అయితే.. ప్రతి ఏడాది మార్చిలోనే ఒంటి పూట బడులు ప్రారంభం అవుతుండగా. ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాఠశాలల పనిదినాలు తక్కువగా ఉండడంతో ఏప్రిల్ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఏటా జూన్ 12 నుంచి పాఠశాలలను తిరిగి తెరుస్తుండగా 2021–22 విద్యాసంవత్సరంలో కరోనా వల్ల ఆగస్ట్ మూడో వారం నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో పని దినాలు తగ్గాయి. సెలవు రోజుల్లో పాఠశాలలను నిర్వహిస్తూ కనీసం 180 పని దినాలు ఉండేలా క్యాలెండర్‌ను సర్దుబాటు చేశారు. అయితే.. సిలబస్ ఇంకా పూర్తి కానందున ఒంటిపూట బడులను ఈ నెల నుంచి కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.
వేసవి సెలవులు ఎప్పుడంటే..
మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే లో పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఉపాధ్యాయులు, సిబ్బంది ఆ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలు ఆలస్యమవ్వనున్నందున సెలవులను జూన్ చివరి వరకు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా.. పదో తరగతి పరీక్షలు ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో జూన్ చివరి వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. జూలై మొదటి వారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.