Group-1 Exam: ఓఎంఆర్‌ పద్ధతిలోనే గ్రూప్‌-1 పరీక్ష

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఓఎంఆర్‌ పద్ధతిలో జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష

By అంజి  Published on  15 May 2023 8:29 AM IST
Group-1 exam, TSPSC, OMR method, telangana

Group-1 Exam: ఓఎంఆర్‌ పద్ధతిలోనే గ్రూప్‌-1 పరీక్ష

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఓఎంఆర్‌ పద్ధతిలో జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాది ఏప్రిల్‌ 26వ తేదీన 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వగా.. అక్టోబర్‌ 16న పరీక్ష నిర్వహించింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. ఆ తర్వాత 25,050 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఆ వెంటనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది.

గతేడాది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే ఛాన్స్‌ ఇచ్చింది. జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షపై అభ్యర్థుల్లో కాస్త అయోమయం నెలకొంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పరీక్ష వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష జరుగుతుందని, ప్రిపరేషన్‌ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

Next Story