గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ప్రణాళికలు, జీవనోపాధిని ప్రోత్సహించడంలో ఎదురయ్యే అడ్డంకులను గుర్తించడం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై కోర్సులు చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) మంచి అవకాశం కల్పిస్తోంది.
ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి లాభాపేక్ష లేని సామాజిక అంశాలకు సంబంధించి పని చేయడంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అనుభవం లేకపోయినా ఆయా ప్రాంతాల్లో పని చేయాలనే తపన ఉంటే అప్లై చేసుకోవచ్చు. కనీస వయసు 21 ఏళ్ల నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలి. స్థానిక భాషపై పట్టు తప్పనిసరి.
తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 27,2021.మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్)నకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఐఐఎంలలో 660కి పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అహ్మదాబాద్, బెంగళూరు, జమ్మూ, కోజికోడ్, లఖ్నవు, నాగ్పూర్, రాంచీ, ఉదయ్పూర్, విశాఖపట్నం ఐఐఎంలు ఉన్నాయి. ప్రస్తుతం ఐఐఎం-బెంగళూరు ఉమ్మడి ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం. ప్రోగ్రామ్ రెండు సంవత్సరాలు ఉంటుంది.